శాసనసభ సభ్యుల రాజీనామాతో మైనారిటీలో పడిపోవడంతో నాలుగు రోజులుగా బలపరీక్ష నుంచి రకరకాల సాకులతో తప్పించుకుంటున్న కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం సోమవారం ఎదురుకానున్న బలపరీక్షను తప్పించుకోవడానికి ఇప్పటికే సాకుల అస్త్రాలను సిద్ధం చేసుకుంది.ఇప్పటికే అనారోగ్యాన్ని సాకుగా చూపి సీఎం కుమారస్వామిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బలపరీక్ష వాయిదా పడడానికి అవసరమైన సాకును సిద్ధం చేసుకున్న కాంగ్రెస్-జేడీఎస్ నేతలు మరిన్ని అస్త్రాల కోసం వెతుకుతున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణాన్ని బలపరీక్ష నుంచి తప్పించుకోవడానికి సాకుగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన నేపథ్యంలో ఆమెకు కర్ణాటక అసెంబ్లీ నివాళి అర్పించవచ్చు. ఆమెకు నివాళిగా సభను ఒక రోజు పాటు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సోమవారం విశ్వాస పరీక్ష లేనట్టే!అంతేకాదు సంకీర్ణ నేతలను మరో అవకాశం కూడా ఉంది.అదెలాగంటే విశ్వాస తీర్మానానికి సంబంధించి పలు అంశాలు సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. విశ్వాస పరీక్ష సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలను సభకు హాజరయ్యేలా చేయడానికి విప్ జారీ చేసే అధికారాన్ని కాంగ్రెస్ వాళ్లు కోర్టు ద్వారా సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను సభకు హాజరు కావాలని తాము బలవంత పెట్టలేమని కోర్టు చెప్పింది. అయితే విప్ జారీ చేసి ఎమ్మెల్యేలను సభకు తీసుకెళ్లే అధికారం తమకు ఉందని.. ఆ విషయం గురించి చెప్పాలని సుప్రీం కోర్టును అధికార పక్షం కోరుతోంది. దానిపై సోమవారం విచారణ జరగనుంది.కాబట్టి ఆ అంశం మీద తీర్పు వచ్చే వరకూ ఓటింగ్ వద్దని స్పీకర్ నిర్ణయించవచ్చని అంటున్నారు. అలా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ కూడా కుమారసర్కారుకు సోమవారం గండం నుంచి గట్టెక్కించేందుకు ఉపయోగపడనుందని విశ్లేషకులు అంటున్నారు. విశ్వాస పరీక్షను మరింత ఆలస్యం చేయడానికే కాంగ్రెస్–జేడీఎస్ వ్యూహాత్మకంగా ఇలా సీఎంతో నాటకాలు ఆడిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.కాగా సోమవారం కచ్చితంగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ సురేష్ కుమార్ కు కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మంగళవారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూలకుండా ఉండాలంటే రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు పలకడం తప్ప మరో మార్గం లేదు.