విజయవాడ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ట్విట్టర్ వార్‌లోకి వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ ఎంటరయ్యారు.దీంతో ఇకపై కేశినేని నానికి,పీవీపీకి మధ్య కూడా మాటల తూటాలు పేలే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి.కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ,ఒకరి అవినీతి మరొకర తవ్వుకుంటూ తిట్టుకుంటున్న కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న వ్యవహారంలో మధ్యలో ఎంటర్ అయ్యారు పీవీపీ . ప్రజా సమస్యల కోసం పని చెయ్యాల్సిన నాయకులు అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిట్టుకోవటంపై స్పందించిన పీవీపీ చట్టసభల్లో బల్లలరిగేలా కూర్చుని బ్యాక్ సీట్లు పెంచడం కాదని చెప్పి మిమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అంతే కాదు ట్విట్టర్లో కూర్చుని కాలక్షేపం చేస్తారా? అని మండిపడ్డారు. మీ ఇద్దరి పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ఏకీభవిస్తున్నారని ఒకరి ఘనత మరొకరు బాగానే చెప్పుకుంటున్నారని పీవీపీ ట్వీట్లో పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించిన పీవీపీ ఎంపీ కేశినేని నానికి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.అందుకు సంబంధించి నానికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఎన్నికల సందర్భంగా కేశినేని నాని నోటికి వచ్చిన విధంగా ప్రచారం చేశారని , తనను నేరస్తుడని ఆరోపించారంటూ పొట్లూరి మండిపడ్డారు. అందుకే తాను ఎంపీకి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పొట్లూరి తెలిపారు.నానితో పాటు మరో రెండు ప్రసార మాధ్యమాలకు కూడా పీవీపీ లీగల్ నోటీసులు పంపించారు.తనపై ఎక్కడా కూడా కేసులు లేవని, అలాంటిది తనపై టిడిపి ఎంపి కేశినేని బురదచల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు పీవీపీ . పనామా పేపర్లలో తన పేరుందని కేశినేని నానీ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తాను లీగల్ నోటీసును ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్లో పోస్టు కూడా పెట్టారు. ‘కొంతమంది పెద్దలు షో మాస్టర్లలా కాకుండా టాస్క్ మాస్టర్లలా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను‘ అంటూ పోస్ట్ చేసి నోటీసులు కూడా ట్యాగ్ చేశారు.పీవీపీ పంపించిన నోటీసులపై స్పందించిన నాని ఈ ఉడుత ఊపుళ్లు నేను చిన్నప్పుడే చూశానని లీగల్ నోటీసులు పంపడం ద్వారా తననేమీ భయభ్రాంతులకు గురిచేయలేరని నోటీసులను చాలా లైట్ గా తీసుకున్నారు.ట్విట్టర్లో జరుగుతున్న మాటల యుద్ధంలోకి పీవీపీ కూడా ఎంటర్ కావడంతో కేశినేని నానీ ఒక పక్క సొంత పార్టీ నేతలతోనూ, మరోపక్క వైసీపీ నేతలతోనూ పోరాటం చేస్తున్నారు.