ఢిల్లీ : భారత క్రికెట జట్టు కోచ్, సహాయక బృందం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని వెల్లడించింది. ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్లను తిరిగి నియమించనున్నారు. జులై 30 సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ప్రస్తుత కోచింగ్ బృందం దరఖాస్తు చేసుకోకుండానే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ప్రధాన కోచ్ అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్ సభ్య దేశం/ ఏ-జట్టు/ఐపీఎల్ జట్టుకు మూడేళ్లు ఆడిన అనుభవం ఉండాలి. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం అవసరం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకూ పై నిబంధనలే వర్తిస్తాయి. ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను మాత్రం 10 టెస్టులు లేదా 25 వన్డేలకు కుదించారు. గరిష్ట వయో పరిమితి అరవై ఏళ్లు. ప్రస్తుత ప్రధాన కోచ్ రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌ల పదవీ కాలం ప్రపంచకప్పుతో ముగిసింది. వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ వారికి 45 రోజుల గడువు పొడిగించింది. ఈ ముగ్గురూ తిరిగి సహాయక బృందంలో చేరే అవకాశం ఉంది.