అమరావతి : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువగానే కల్పించామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయనకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనడం సరికాదని అన్నారు. నిబంధనల ప్రకారం ఆయనకు ఇప్పుడు కల్పించిన భద్రత కంటే తక్కువగానే ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే క్రమంలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవలకు కొన్ని సార్లు రాజకీయ ముద్ర వేస్తున్నారని నిష్టూరమాడారు. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను తొలగించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టుకోవడంపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని ఆయన వెల్లడించారు.