ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తే ఎటువంటి అద్భత పథకాలు ప్రవేశపెట్టచ్చో కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ రవిందర్ మరోసారి నిరూపించారు.ఇప్పటికే ప్రవేశపెట్టిన ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకానికి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతుండగా తాజాగా ఇదే తరహాలో మరో నాలుగు పథకాలు ప్రజల కోసం అందుబాటులోకి తేవడానికి మేయర్ రవీందర్ సింగ్ సిద్ధమయ్యారు.జులై 2వ తేదీకి పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు నిర్వహించే స్కీమ్ అమలు చేయబోతున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సాయంతో ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించి కార్పొరేషన్ ఆవరణలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్ చేసే విధంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు. చెప్పులు లేకుండా తిరిగే అనాధలకు, పేదలకు చెప్పులు అందించే విధంగా బూట్ హౌస్ పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొందరు మూలన పడేసే పాత చెప్పులు, బూట్లను సేకరించి వాటికి రిపేర్లు చేసి అవసరమైన వారికి వాటిని అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. దానికోసం కళాభారతి ఆవరణలో ఓ షెడ్డును నిర్మించనున్నట్లు వెల్లడించారు. కొన్ని కమ్యూనిటీ హాళ్లను ఎంపిక చేసి నాలుగు రీడింగ్ రూమ్స్ ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు. సేవా దృక్ఫథంతో మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న నైట్ షెల్టర్‌లో అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.ఇటీవలే ఒక్క రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది కరీంనగర్ కార్పొరేషన్. స్థానికంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కార్పొరేషన్ అండగా నిలబడేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉండే వారికి భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కరీంనగర్లో ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రవేశపెట్టిన రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకోవడం విశేషం..