బర్మింగ్‌హామ్ : క్రికెట్ అభిమానులు ఒక్కోసారి హద్దు మీరుతుంటారు. తమ హీరోల పట్ల దురభిమానాన్ని ప్రదర్శించి అభాసుపాలవుతుంటారు. అలాంటి సంఘటనే బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కు టీమిండియా శుక్రవారం సాయంత్రం బర్మింగ్‌హామ్ చేరుకుంది. వారికి అక్కడ ఓ హోటల్‌లో బస కల్పించారు. ఉన్నట్లుండి కొందరు వ్యక్తులు కేకలు వేసుకుంటూ ఆటగాళ్లను చేరుకోవడానికి ప్రయత్నించారు. వారున్న లాబీ వైపు దూసుకు వెళ్లడంతో పాటు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను తీయడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంది. టీమిండియా ఫిర్యాదు మేరకు వారిని హోటల్ యాజమాన్యం హెచ్చరించి, వదిలేసింది.