ఢిల్లీ : తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు తెదేపా శుక్రవారం ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. చైర్మన్‌ను కలసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి ఉన్నారు. ఆయనకు లేఖను అందజేశారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావులు భాజపాలో చేరడం ఫిరాయింపుల కిందికే వస్తుందని వారు వాదించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 10వ షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశం ఉందని తెలిపారు. కనుక భాజపాలో చేరిన తెదేపా ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని చైర్మన్‌ను కోరినట్లు వెల్లడించారు.