హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు రుతుపవనాలు పలకరించాయి. 11 రోజులు ఆలస్యమైనా నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ సంచాలకులు వైకే. రెడ్డి తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఈసారి సుమారు 97 శాతం వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనందున సగటు వర్షపాతం తగ్గవచ్చని తెలిపారు. మొత్తమ్మీద తెలంగాణలో 755 మి.మీలు, ఆంధ్రప్రదేశ్‌లో 931 మి.మీల వర్షపాతం నమోదు కావచ్చన్నారు. ఈ నెల 28 నుంచి జులై నాలుగు వరకు తెలంగాణ, కోస్తాంధ్రలో సాధారణం కంటే ఎక్కువ, రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.