లండన్ : భారత బ్యాటింగ్ దిగ్గజం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ కప్పులో భాగంగా శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 104 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మన్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కోహ్లీ ఇప్పటివరకు 131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ-20లతో మొత్తం 415 ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ టెండూల్కర్, విండీస్ దిగ్గజం బ్రియన్ లారాలు 453 ఇన్నింగ్స్ లో 20 వేల పరుగులు చేశారు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్‌లో 20 వేల మైలురాయిని చేరుకుని మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో 11 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది.