హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలనుకుంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఊహించని విధంగా కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ప్రస్తుత పరిణామాలపై చర్చించడానికి ఆయన అంబర్‌పేటలోని కళ్లెం బాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభంలోనే మెజారిటీ కార్యకర్తలు జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. తాము కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎంపీపీ వెంకట రెడ్డి మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలని చూస్తున్నారని విమర్శించారు. కాగా కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా విమర్శించిన రాజగోపాల్ రెడ్డి, తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన త్వరలో భాజపాలో చేరనున్నట్లు సమాచారం.