సౌతాంప్టన్ : భారత జట్టును గాయాల బెడద పీడిస్తోంది. ఇప్పటికే ఓపెన్ శిఖర్ ధావన్ టోర్నీకి దూరమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాలు పట్టేయడంతో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు కూడా వేయకుండానే పెవిలియన్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. బుధవారం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బుమ్రా వేసిన యార్కర్ శంకర్ పాదాలకు బలంగా తగిలింది. అతడు నొప్పితో బాధ పడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు వర్గాలు తెలిపాయి. కాగా భువనేశ్వర్ విషయంలో జట్టు గోప్యత పాటిస్తోంది. ధావన్ గాయపడినప్పుడు కూడా ఇలాగే గోప్యత పాటించింది. భువనేశ్వర్ కండరాలు పట్టేశాయా లేక కండరాల్లో చీలిక వచ్చిందా అనేది స్పష్టంగా తెలియడం లేదు. జూన్ 30న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నారు. ఒక వేళ ధావన్ లాగా భువీ కూడా ఇంటి ముఖం పడితే ఇషాంత్ శర్మకు పిలుపు రావచ్చు. ఎడమ చేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్ స్టాండ్‌బై బౌలర్‌గా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు.