దిల్లీ: కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ ఏకే ఆంటోనిని కలిశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు ఆంటోనీ వివరణ కోరారని, తనని సస్పెండ్ చేయడం ఏమిటంటూ ఆయన ఆశ్చర్యపోయారని సర్వే మీడియాతో చెప్పారు. ఉత్తమ్, కుంతియా తప్పిదాలను ఆంటోనీకి వివరించానన్నారు. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా వ్యవహరించారని సర్వే వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి చర్యలతో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, తెజస అధ్యక్షుడు కోదండరాం అభాసుపాలయ్యారని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నంలాంటి స్థానాల్లో సమర్థులకు టికెట్ కేటాయించకుండా పార్టీకి నష్టం చేశారన్నారు. పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్‌పైనే చర్యలు తీసుకోవాలని ఆంటోనీని కోరినట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ చెప్పారని సర్వే మీడియాకు తెలిపారు.