బెంగళూరు : మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీ నటి సుమలత తాను భాజపాలో చేరేది లేదని స్పష్టం చేశారు. స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు లేకుండా కాంగ్రెస్ పోటీ చేసి ఉంటే మరిన్ని స్థానాల్లో గెలిచి ఉండేదని తెలిపారు. జేడీఎస్‌తో పొత్తు వల్ల కాంగ్రెస్ అనేక నియోజకవర్గాల్లో విజయావకాశాలను పోగొట్టుకుందని సానుభూతి వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే పది స్థానాల్లో సులభంగా గెలిచి ఉండేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు తాను ఇదే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ప్రజా బలంతో భాజపా గెలిచిందని తాను భావించడం లేదని ఆమె తెలిపారు. కాగా సుమలత భర్త, కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్ గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆయన సొంతూరు మండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుమలత పోటీ చేయాలనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లక్షకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.