జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్టు చిక్కుముడి వీడనుందా? ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా తెదేపా అధిష్ఠానం చేపట్టిన కసరత్తు చివరి అంకానికి చేరిందా? ఒకరిని ఎంపీకి.. మరొకరిని ఎమ్మెల్యే స్థానాలకు పంపేలా నిర్ణయం జరిగిందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. ఎవరు ఎక్కడుంటారో తాను నిర్ణయిస్తానంటూ అధినేత స్పష్టం చేసినట్లు క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జమ్మలమడుగు టిక్కెట్ల ప్రక్రియ చివరి మలుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల నుంచి ఇదే అంశంపై అధినేత చంద్రబాబు వద్ద చర్చలు జరుగుతున్నాయి. తెదేపాలోనే ఆదినారాయణరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే, మరొకరు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించగా… ఇద్దరూ ఎమ్మెల్యే టిక్కెట్టుకే మొగ్గు చూపారు. ఓ దశలో ఇరు పక్షాలకు చెందిన కుటుంబ సభ్యులను పిలిచి మరీ చర్చించగా ఏకాభిప్రాయం కుదరలేదు. కుటుంబ సభ్యులు ఎంపీకి పోటీ చేసేందుకు ససేమిరా అనడంతో వారం రోజులు చర్చల పర్వం కొనసాగింది. ప్రస్తుతం అది చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. పి.రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం టిక్కెట్ల కేటాయింపులు ఉంటాయన్న సూచన నేపథ్యంలో క్షేత్రస్థాయికి సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకరికి ఎంపీ టిక్కెట్టుతోపాటు ఎమ్మెల్సీ పదవిని అందించే అవకాశాలు కనిపిస్తుండగా మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా చర్చ జరుగుతోంది. సోమవారం రాత్రి 2 గంటల వరకు జరిగిన కీలక భేటీలో ఇదే అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం మరోసారి చర్చ జరుగుతుందని భావించినా చంద్రబాబు కర్నూలు, దిల్లీ పర్యటనకు వెళ్లడంతో అవకాశం లేకుండా పోయింది. మరోమారు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుండగా సంక్రాంతి తర్వాత అధికారికంగా జాబితా వెలువరించే అవకాశం కనిపిస్తోంది. జమ్మలమడుగు స్థానానికే రోజుల తరబడి చర్చలు జరగ్గా మిగిలిన వాటి పరంగా పరిస్థితి ఏమిటన్న విషయంగా చర్చ సాగుతోంది. బద్వేలు, రాయచోటి, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు… ఇలా అన్నింటా వర్గ పోరు తారస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక క్లిష్టపరీక్ష కానుంది. ప్రతి పక్ష పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. బుధవారంతో వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తికానుంది. అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లి అక్కడనుంచి జగన్ కడపకు రానున్నారు. పులివెందుల, ఇడుపులపాయలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.