పండగ పూట వంట గ్యాస్‌ కష్టం

విజయవాడ: సంక్రాంతి పండగ సమీపిస్తోంది. మహిళలు పిండివంటలు చేయడం ప్రారంభించారు. గ్యాస్‌ సిలిండర్లు రాకపోవడంతో పండగ పూట కష్టం వచ్చింది. గత రెండు రోజులుగా సరఫరా లేకపోవడంతో నిరీక్షణ జాబితా పెరిగిపోతోంది. గత రెండు రోజులుగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు సమ్మె చేస్తున్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, రవాణా తదితర రంగాల వారు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ ప్రభావం వంటగ్యాస్‌పై పడింది. సోమవారం నుంచే కర్మాగారాల్లో ఫిల్లింగ్‌ నిలిపివేశారు. ముందస్తుగా గ్యాస్‌ అందుబాటులో ఉన్నా.. ఫిల్లింగ్‌ లేదు. కొండపల్లి వద్ద మూడు కంపెనీల ఫిల్లింగ్‌ కర్మాగారాలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు ఇక్కడి నుంచే సిలెండర్లు వెళుతుంటాయి. ఒక్క కర్మాగారంలో రోజుకు మూడు షిప్టులలో కార్మికులు పనిచేస్తుంటారు. రెండు షిప్టులలో ఫిల్లింగ్‌ ఉంటుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఒక్క లోడ్‌ బయటకు రాలేదు. బుధవారం కూడా సమ్మె కొనసాగుతుంది. గురువారం నాటికి లారీలు బయటకు రానున్నాయి. అవి డీలర్ల వద్దకు చేరితే కానీ పంపిణీ జరగదు. కృష్ణా జిల్లాలో దాదాపు 13.28లక్షల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దీపం కనెక్షన్లు సుమారు 2లక్షలు. సగటున కుటుంబానికి నెలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తారని అంచనా. కొంతమంది రెండు నెలలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తారు. ఇలాంటి పండుగలు వచ్చిన సమయంలో సిలిండర్లు త్వరగా ఖాళీ అవుతుంటాయి. నెలకు సుమారు 10లక్షల సిలిండర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని నల్లబజారుకు తరలుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని జనం కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos