న్యూఢిల్లీ: భోపాల్ నగరంలో సాధువు కంప్యూటర్ బాబా నిర్వహిస్తున్న ‘హఠయోగ’ గురించి గురువారం ఎన్నికల సంఘం (ఈసీ) విచారణకు ఆదేశించింది. భోపాల్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం ఇక్కడడి ఒక మైదానంలో మంగళవారం నుంచి కంప్యూటర్ బాబా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీని గురించి భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది దరిమిలా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుధామ ఖడే కంప్యూటర్ బాబా ‘హఠయోగా’కి ఎవరు ? ఎప్పుడు అనుమతులు జారీ చేసారు? కంప్యూటర్ బాబా సహా ఇతర సాధువులను దిగ్విజయ్ సింగ్ ఆహ్వానించారా? ఏ పార్టీ తరపున కంప్యూటర్ బాబా ప్రచారం చేస్తున్నారు? అందుకు ఆయన తీసుకుంటున్న ప్రతిఫలం తదితరాల గురించి విచారణ చేపట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంప్యూటర్ బాబాకు మంత్రి హోదా కల్పించారు. ఆయన అసలు పేరు నాందేవ్ దాస్ త్యాగి. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తానని నమ్మించి ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా రామమందిరాన్ని నిర్మించలేకపోయారని విమర్శించారు. మందిరం లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదంటున్న కంప్యూటర్ బాబా దిగ్విజయ్ గెలుపు కోసం 5000-7000 మంది సాధువులతో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోపాల్లో దిగ్విజయ్ సింగ్కు పోటీగా బీజేపీ నుంచి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాగూర్ బరిలో నిలిచారు.