కేవలం సినిమాలు తీయడం,లాభాలు గడించడంపై మాత్రమే ఆలోచించే సినిమా పరిశ్రమలో కొద్ది కాలంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు మాత్రమే కాకుండా వీలుచిక్కిన ప్రతీసారి దర్శకులు,నిర్మాతలు,హీరోలు తమకు తోచిన విధంగా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కొందరు వేసవి సమయంలో రోడ్లపై చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా మరి కొంతమంది రాజకీయ నేతలతో కలసి కొన్నిప్రాంతాల్లో ఉచితంగా తాగునీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు.మూవీ ఆర్టిస్టుల సంఘం సహా చిత్రపురి.. ఫెడరేషన్ వాళ్లు కార్మికుల కోసం ఈ తరహా ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రఖ్యాత సినీనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థ మాత్రం మరో విధంగా ఆలోచించింది.గటంల తరబడి ఎండల్లో నిలబడి ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో ఎండలకు గొంతెండిపోయే ట్రాఫిక్ కానిస్టేబుల్స్.. జీహెచ్ ఎంసీ కార్మికులకు మజ్జిగ బాటిల్స్ ని సరఫరా చేస్తోంది.పనిలో పనిగా ఈ బాటిల్స్ పై ఓ లేబుల్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అల్లు ఎంటర్ టైన్ మెంట్ ఎల్ ఎల్ పి పేరుతో ఇప్పటి నుంచే ఓ కొత్త లేబుల్ ని గీతా ఆర్ట్స్ సంస్థ పాపులర్ చేయడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. అల్లు అరవింద్ – అల్లు అర్జున్- శిరీష్ సహా ఇతర భాగస్వాములు కలిసి స్థాపించిన సంస్థ తాలూకా టైటిల్ ఇదని తెలుస్తోంది.