గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఉత్కంఠ,ఆసక్తి నెలకొంది.ఎన్డీఏ,యూపీఏతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలన్నీ కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది.ఎవరికివారు విజయం తమదంటే తమదేనని ధీమాగా ఉన్నారు.యూపీఏ అధికారంలోకి వస్తే అవినీతి,అక్రమాలు పెరిగిపోతాయని శత్రుదేశాలు పెట్రేగిపోతాయంటూ దేశానికి రక్షణ ఉండందంటూ బీజేపీ ఆరోపిస్తుండగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే దళితులు,మైనారిటీలకు రక్షణ ఉండదని మతవిద్వేషాలు మరింత పెచ్చుమీరుతాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగే ప్రయోజనం శూన్యమని దేశంలో మార్పు రావాలన్నా,అభివృద్ధి చెందాలన్నా ఫెడరల్ ఫ్రంట్ వల్లే సాధ్యమవుతుందంటూ ఫెడరల్ ఫ్రంట్‌లోని తెరాస,తృణముల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి.29 రాష్ట్రాల్లోని 543 లోక్‌సభ స్థానాలకు ఏడు విడుతల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిల్చున్నారు.ఇవన్నీ కాసేపు పక్కనపెడితే ప్రస్తుత ఎంపీల ఆస్తుల వివరాలు బయటకు రాగా అందులో అత్యధిక ధనవంతులైన ఎంపీల్లో మొదటి నాలుగు స్థానాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలే ఉండడం విశేషం. రూ.683 కోట్ల ఆస్తులు కలిగిన గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ దేశంలోనే ధనిక ఎంపీల్లో మొదటిస్థానంలో నిలువగా రూ.528 కోట్ల ఆస్తులతో తెలంగాణలోని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి రెండవ స్థానంలో నిలిచారు.

రూ.288 కోట్ల ఆస్తులతో నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు మూడవ స్థానంలో నిలిచారు.గత ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచి మధ్యలో తెదేపాలో చేరి అక్కడ టికెట్ దక్కకపోవడంతో ఇటీవల తిరిగి వైసీపీ గూటికి చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రూ.242 కోట్ల ఆస్తులతో నాలుగవ స్థానంలో నిలిచారు.చాలా రాష్ట్రాల్లో రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య ఆస్తులు కలిగిన ఎంపీలు ఉండగా రూ.34,311 మాత్రమే ఆస్తులు కలిగిఉన్న రాజస్తాన్ రాష్ట్రంలోని సికర్ నియోజకవర్గ ఎంపీ సుమేదానంద్ సరస్వతి చివరిస్థానంలో ఉన్నారు..
