తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యత కనబరిచే తెరాసకు ఖమ్మంలో మాత్రం పట్టు అంతంత మాత్రమే.ఇదే విషయం శాసనసభ ఎన్నికల్లో కూడా రుజువైంది.ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కేవలం ఒకేఒక్క నియోజకవర్గానికి మాత్రమే తెరాస పరిమితమైంది.ఖమ్మం జిల్లాలో తెరాసపై కాంగ్రెస్ పార్టీనే పైచెయ్యి సాధించింది.ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో విజయం సాధించడానికి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరిని కాంగ్రెస్ బరిలో దించింది. మరోవైపు ఖమ్మంపై కన్నేసిన తెరాస కూడా అందుకోసం తెదేపా నుంచి తెచ్చుకున్న నామా నాగేశ్వరరావును ఖమ్మం నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో దించింది.గెలుపు కోసం అభ్యర్థి నామాతో పాటు తెరాస మంత్రులు,నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే రేణుకా చౌదరి మాత్రం సింగిల్‌గానే ప్రచారాల్లో దూసుకెళుతున్నారు. ప్రచారాల్లో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రేణుకా మాటల తూటాలు పేలుస్తున్నారు.కుటుంబాన్ని పోషించే బాధ్యత లేని ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం విలువలు,ప్రాధాన్యత గురించి ఏం తెలుస్తుందంటూ ప్రశ్నించారు.ఇక లోక్‌సభ ఎన్నికల్లో 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ బీరాలు పలుకున్న కేసీఆర్ ప్రస్తుతం చేతిలో ఉన్న 14 మంది ఎంపీలతో ఎంతమేర చక్రం తిప్పారంటూ ప్రశ్నించారు.రేణుకా చౌదరి వాగ్ధాటికి తెరాస నేతలకు చెమటలు పడుతున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు..