గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం లేదని సర్వేల్లో తేలడం ఎన్డీఏ,యూపీఏలతో పాటు ఫెడరల్ ఫ్రంట్ కూడా బరిలో ఉండడంతో ఎన్నికలపై ఆసక్తి రెట్టింపయింది.ఫెడరల్ ఫ్రంట్‌లో కీలకంగా మారిన తెరాస అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో 16కు 16 సీట్లలో తెరాస జెండా ఎగరెయ్యడానికి వ్యూహాలు,ప్రణాళికలు సిద్ధం చేశారు.అయితే తనయురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్న నిజామాబాద్ నియోజకవర్గం మాత్రం కేసీఆర్‌లో ఎక్కడో గబులు రేపుతోంది.నిజామాబాద్ ఎన్నికలు ఏకపక్షం అవుతాయని భావిస్తున్న వేళ అనూహ్యంగా 175 మంది రైతులు బరిలో దిగడంతో ఏకపక్షం కాస్తా కురుక్షేత్రమయింది.ఇతర పార్టీల అభ్యర్థులతో మొత్తం 185 నామినేషన్లు ఆమోదం కాగా అందులో 175 నామినేషన్లు రైతులవే.ఇంతమంది బరిలో నిల్చోవడంతో ఈవీఎంలు వాడే అవకాశమే లేకుండా పోయింది.175 మంది అభ్యర్థుల పేర్లు ఈవీఎంలో పట్టవకనుక బ్యాలెట్ కాగితాలతో నిజామాబాద్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది.పార్టీలకు చెందిన అభ్యర్థుల మినహా 175 మంది స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రత్యేక గుర్తులు,బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాల్సి ఉండడం ఎన్నికలకు కేవలం 11 రోజులు మాత్రమే ఉండడంతో నిజామాబాద్‌కు మొదటివిడతలో ఎన్నికలు జరిగే అవకాశాలపై కూడా నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆంగ్ల అక్షరమాల ప్రకారం 185 మంది అభ్యర్థుల పేర్లు,గుర్తులతో బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సి ఉండడంతో ఎన్నికల చరిత్రలోనే నిజామాబాద్ ఎన్నికల బ్యాలెట్ కాగితం అతిపెద్ద బ్యాలెట్ కాగితంగా నిలవనుంది.ఆంగ్ల అక్షరమాల ప్రకారం కవిత పేరు ఎక్కడో మధ్యలో ఉండనుండగా కారు గుర్తును పోలిన మరి కొన్ని గుర్తులు రైతులకు కేటాయించే అవకాశం ఉండడంతో కవిత పేరుతో వెతుక్కోవడం,కారు గుర్తు వెతుక్కోవడం కొంచెం కష్టతరమయ్యే పని కావడంతో కవిత ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.ఇదే విషయం కేసీఆర్‌ను కలవరపెడుతోంది.కాగా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొనే కేసీఆర్‌పై రైతులు ఇంత కోపంతో రగిలిపోయి కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవితపై పోటీకి దిగడం ఆశ్చర్యంగా ఉంది.తమ సమస్యలు పట్టించుకోకపోతే రైతులకు వచ్చే కోపం ఎలా ఉంటుందో నిజామాబాద్ ఎన్నికల ఎపిసోడ్‌తో అందరికీ అర్థమయ్యే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..