కందుకూరు : ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో ఇప్పటికీ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అందించిన రాజన్న పాలన కోసం జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోరారు. ప్రకాశం జిల్లా కందుకూరులో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైకాపా స్వల్ప తేడాతో ఓడిపోయిందని, ఈసారి అలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు. పరిటాల రవి హత్య కేసులో రాజశేఖర రెడ్డి సీబీఐ దర్యాప్తు జరిపించారని గుర్తు చేశారు. తన మరిది వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే వైఎస్సాఆర్ అక్కడికెళ్లి ఆయనను ఓదార్చారని తెలిపారు. దాడిని ఖండిస్తూ ధర్నా కూడా చేశారన్నారు. ఈరోజు తన మరిది హత్యకు గురైతే చంద్రబాబు పరవశించిపోతున్నారట…ఎందుకో ఆ పరవశం అంటూ ఆమె ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకు రాని ప్రజలు చంద్రబాబుకు ఎన్నికల ముందు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా జగన్ నవరత్నాలు గురించి చెబుతుంటే, ఇప్పుడు చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి పులే. నక్క నక్కే…అని ఆమె వ్యాఖ్యానించారు.