సొంత రాష్ట్రంలో మోదీకి అంత వీజీ కాదు…

ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి గెలుపు అంత సునాయాసంగా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ కనీసం ఏడెనిమిది స్థానాల్లో బీజేపీకి చుక్కలు చూపించడం ఖాయమనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మాత్రం 12 స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీ, జునాగఢ్, బోటాడ్, సురేంద్ర నగర్‌లు ఈసారి కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చని భావిస్తున్నారు. మధ్య గుజరాత్‌లోని ఆనంద్, ఉత్తర గుజరాత్‌లోని బనాస్కాంఠా, పాటన్ సీట్లనూ గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు స్థానాల్లో కూడా తమకు విజయావకాశాలున్నాయని, ఆ దిశగా దృష్టి సారించామని వారు చెబుతున్నారు. మరో వైపు ఇన్నేళ్లూ బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న పాటీదార్లను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోగలిగింది. ఠాకూర్, క్షత్రియులు కూడా గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెన్నంటి నిలిచారు. బీసీ సామాజిక వర్గమైన కోలీలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న సన్న, చిన్న కారు రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ సర్కారు తమకు ఒరగబెట్టిందేమీ లేదనే నిరాశ నిస్పృహలు వారిని ఆవరించాయి. మరో వైపు పాటీదార్, ఠాకూర్ వర్గాల నేతలు హార్ధిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్‌లు కాంగ్రెస్‌లో ఉండడం కూడా ఆ పార్టీకి అనుకూలమైన అంశం. అయితే శాసన సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా గెలుపొందిన అయిదు మంది బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు నిరాశను మిగుల్చుతోంది. ఈ పరిస్థితుల నడుమ ఏప్రిల్ 23న రాష్ట్రంలో పోలింగ్ జరుగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos