
కడప : ‘2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబుకు పరాజయం అని ఒక ఇంగ్లీషు దినపత్రిక రాసింది. అది నిజం కాబోతుంద’ని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం మైదుకూరులో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో వైకాపా అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన తర్వాత ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని, అవినీతిని పెంచిపోషించారని ఆరోపించారు. జన్మ భూమి కమిటీలు తమ వారికే మేలు చేసాయని విమర్శించారు. విలువైన ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ‘నువ్వు నేను కలిస్తే, మనం, మనం… మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే కలిస్తే వైఎస్ జగన్‘ అని అభివర్ణించారు. ప్రియమితృడైన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడి పార్టీలో చేరటం తనకు సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ దీమా వ్యక్తం చేశారు.