
హైదరాబాదు:లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా అడ్డుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం వ్యాఖ్యానించారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఒక సినిమా విడుదల కాకుండా అడ్డు కోవడం దేశ సినీ చరిత్రలో ఇదే మొదటి సారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వును న్యాయం కోసం అత్యున్నత న్యాయ స్థానంలో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరితో దీని గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామ న్నారు. ఆంధ్ర ప్రదేశ్లో సినిమా విడుదలకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో అక్కడా కూడా సినిమా విడుదలవుతుందని ఆశించారు.‘ఈ సినిమా విడుదలను ఎవరు అడ్డుకున్నారో అందరికీ తెలుసు. ఈ వ్యాజ్యం విచారణ ప్రస్తుతం ఉన్నత న్యాయ స్థానంలో జరుగు తున్నందున తాను ఆ వ్యక్తి పేరు బయటకు చెప్పడం లేదు. ధైర్యం లేక కాదు’ అని అన్నారు.