ఢిల్లీ : తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా గొలుసుకట్టు హోటళ్లు కలిగి ఉన్న శరవణ భవన్ యజమాని పీ. రాజగోపాల్‌కు సుప్రీం కోర్టు ఓ హత్య కేసులో శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జులై ఏడో తేదీ లోపు కోర్టు ముందు లొంగిపోవాలని కూడా ఆదేశించింది. సంఘటన జరిగిన దాదాపు 18 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. తన సంస్థలో పని చేసే శాంత కుమార్ అనే ఉద్యోగి హత్యకు సంబంధించిన కేసులో రాజగోపాల్ నిందితుడు. చెన్నై హైకోర్టు 2009లో అతనికి జీవిత ఖైదును విధించింది. అనారోగ్య కారణంతో అదే ఏడాది అతనికి బెయిల్ మంజూరైంది. తదనంతరం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణను జస్టిస్ ఎన్‌వీ. రామన్ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాజగోపాల్ సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చెన్నైలోని శరవణ భవన్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ కుమార్తె జీవజ్యోతిపై రాజగోపాల్ కన్ను పడింది. అతను పెళ్లి ప్రతిపాదనను తీసుకు వచ్చినప్పుడు జ్యోతి గట్టిగా వ్యతిరేకించింది. అప్పటికే అతనికి ఇద్దరు భార్యలున్నారు. 1999లో శరవణ గ్రూపులోనే పని చేస్తున్న శాంత కుమార్‌తో ఆమె వివాహం జరిగింది. కానీ రాజగోపాల్ ఊర్కోలేదు. అతనితో తెగతెంపులు చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతిని వేధించడం ప్రారంభించాడు. క్రమంగా చంపేస్తానంటూ బెదిరించడం కూడా మొదలెట్టాడు. దీనిపై భర్తతో కలసి ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన రాజగోపాల్ 2001 అక్టోబరులో ఎనిమిది మంది కిరాయి గుండాలతో శాంత కుమార్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయించాడు. కొడైకెనాల్‌లోని అడవుల్లో శాంత కుమార్ మృతదేహం లభ్యమైంది.