స్వీడన్లో ఓ ఉద్యోగం ఉందండోయ్…ఓ రైల్వే స్టేషన్లో తెల్లారి స్విచ్ వేయడం, సాయంత్రం ఆపివేయడం…అంతే ఉద్యోగం. జీతం నెలకు అక్షరాలా రూ.1.72 లక్షలు. ఇంతకూ విషయమేమంటే…స్వీడన్ ప్రభుత్వం గోతెన్స్బర్గ్లోని కోర్వ్సేగన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ను నిర్మిస్తోంది. అక్కడ ఓ ఉద్యోగిని నియమించాలనుకుంటోంది. ఆ ఉద్యోగి విధులేమంటే, డ్యూటీలో భాగంగా రైల్వే స్టేషన్లోని గడియారం వద్ద ఉన్న బటన్ను నొక్కాలి. వెంటనే అక్కడ అమర్చిన బల్బులు వెలుగుతాయి. డ్యూటీ పూర్తయ్యాక బటన్ ఆఫ్ చేసి వెళ్లాలి. ఈ మధ్య కాలంలో ఉద్యోగి ఏమైనా చేసుకోవచ్చు. జీతంతో పాటు ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, సెలవులు, రిటైరయ్యాక పింఛను తదితర సదుపాయాలుంటాయి. కొత్తగా నిర్మించనున్న రైల్వే స్టేషన్ విభిన్నంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగమే ఈ ఉద్యోగం. దీనికి విద్యార్హతలు ఏమీ లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయ్యాక ఉద్యోగ నియామకం ఉంటుంది.