ఢిల్లీ : బాలీవుడ్ రెబల్ స్టార్, భాజపా అసమ్మతి నేత శత్రుఘ్న సిన్హా వచ్చే నెల ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను పట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తారా అని అడగగా, పరిస్థితులు ఎలాగున్నా, చోటు మారదు అని సమాధానమిచ్చారు. దీంతో ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టమైంది. ఇప్పటివరకు భాజపాలో కొనసాగిన శత్రు, ప్రధాని మోదీ సహా స్వపక్షీయులపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో పార్టీ ఆయనను పక్కన పెట్టడమే కాకుండా పట్నా సాహిబ్ నుంచి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో దింపింది.