
అమరావతి:తమకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్ని నిరూపించాలని లేని పక్షంలో ఫిర్యాదు దార్లపై చర్యల్ని తీసుకో వాలని ఎన్నికల సంఘం బదిలీ వేటుకు గురయిన శ్రీకాకుళం, కడప పోలీసు సూపరెంటెం డెంట్లు వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మ ఎన్నికల సంఘానికి లేఖలు రాసినట్లు గురువారం తెలిసింది. ‘తాము ఏం తప్పు చేశామో విచారణ చేయకుండా ఎలా బదిలీ చేస్తారు. తనపై ఆరోపణలు నిరూపించాలని లేదా తనపై ఫిర్యాదు చేసిన వైకాపా నేతలపై చర్య తీసుకోవాల’ని రాహుల్‌దేవ్ తన లేఖలో పేర్కొన్నారు. వెంకటరత్నం కూడా ఇదే మాదిరి విన్నవించారు. ‘వైకాపా నేత విజయ సాయి రెడ్డి ఆరోపణల ఆధారంగా నా పై ఎంత వేగంగా బదిలీ వేటు వేశారో అంతే వేగంగా నేను దోషినో కాదో తేల్చాల’ని వెంకటరత్నం కూడా విన్నవించారు. ఈ వ్యవహారంలో పరువు నష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు వెనుకంజ వేయబోననీ హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలతో తన ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీశారని, కుటుంబం, మిత్రులు, బంధువులు, సమాజం తన వ్యక్తిత్వాన్ని అనుమానించే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. నిజానిజాల్ని తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని చెప్పారు.