అశ్విన్‌కు క్రమంగా పెరుగుతున్న మద్దతు

అశ్విన్‌కు క్రమంగా పెరుగుతున్న మద్దతు

బెంగళూరు, న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌ : కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రనౌట్ చేసిన తీరు వివాదస్పదమవుతున్న వేళ…క్రికెట్ నియమావళి గురించి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. క్రికెట్ పుట్టినిల్లు లండన్‌లోని మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఎప్పుడో ఈ నియమావళిని రూపొందించగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దానిని యథాతథంగా అమలు చేస్తోంది. మన్కడింగ్‌ పద్ధతిలో ఔట్ చేయడం సహేతుకమేనని నియమావళిలో స్పష్టంగా ఉంది. బౌలర్ బంతిని విసరడానికి ముందే నాన్ స్ట్రయికర్‌గా ఉన్నబ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి బయటకు వెళితే…ఔట్ చేయడాన్ని మన్కడింగ్ అని వ్యవహరిస్తారు. బ్యాట్స్‌మన్‌ను అలా ఔట్ చేయడానికి ముందు ఒకసారి హెచ్చరించాలని, అది నైతికత, క్రీడాస్ఫూర్తి అనిపించుకుంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలా హెచ్చరించాలని క్రికెట్ నియమావళిలో లేదు. కనుక దీనికి చట్టబద్ధత లేదు. సరే…బ్యాట్స్‌మన్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం అనైతికత అయితే…ఏదో లబ్ధి పొందడానికి బ్యాట్స్‌మన్‌ కూడా ముందుగానే క్రీజు వదిలి వెళ్లడం కూడా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమే కదా. అందుకే…అశ్విన్‌కు క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తోంది. అయితే అశ్విన్ బౌలింగ్ చేస్తున్నట్లుగా నటించి, బట్లర్ క్రీజు వెలుపలికి వెళ్లాక ఔట్ చేశాడని, ఇది కచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించాల్సింది ఫీల్డ్ అంపైర్ లేదా థర్డ్ అంపైర్. వారు బ్యాట్స్‌మన్‌ ఔట్ అయినట్లు ప్రకటిస్తే…అందులో నటన లేదనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రికెట్ నియమావళిలో నటనకు కూడా జరిమానా ఉంది.
మన్కడింగ్ అంటే…
1947లో ఇది వ్యవహారంలోకి వచ్చింది. ఆ ఏడాది భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. భారత ఆల్‌రౌండర్‌ వినూ మన్కడ్‌ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ బిల్ బ్రౌన్‌ను ఈ విధంగా రెండు సార్లు ఔట్ చేశాడు. ఒకసారి వార్మప్ మ్యాచ్‌లో కాగా మరోసారి రెండో టెస్టు మ్యాచ్‌లో… వినూ మన్కడ్ తొలిసారి అలా ఔట్ చేశాడు కనుక దీనికి మన్కడింగ్ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ సైతం తన స్వీయ జీవిత చరిత్రలో దీనిని సమర్థించాడు. అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా వినూ మన్కడ్‌ను విమర్శించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos