
గోవా:భాజపాలో చేరేందుకు నిరాకరించిన మహారాష్ట్ర గోమంతక్ పార్టీ( ఎంజిపి) అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుదిన్ దవళీకర్ నిరాకరించటంతో ఆయన పదవి చ్యుతులయ్యారు. మంగళవారం అర్థరాత్రి దాటాక ఎంజీపీ పార్టీకి చెందిన ఇద్దరు విధానసభ సభ్యులు భాజపాలో చేరడంతో గోవా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వారి బాటలోనే నడిచేందుకు సుదిన్ దవళీకర్ అంగీకరించక ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. సుది న్ వారసుణ్ని త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. గోవా పర్యాటక మంత్రి మనోహర్ అజ్గాంకర్, మరో ఎమ్మెల్యే దీపక్ పవాస్కర్ ఎంజీపీ శాసన సభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. వాస్తవానికి ఎంజీపీ బలంతోనే ఇటీవల సీఎం ప్రమోద్ సావంత్ బల పరీక్షలో నెగ్గారు. తీరా అదే పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలో కలుపుకోవడంతో ఎంజీపీ అధ్యక్షుడు రగిలిపోతున్నారు. కాపాలాదార్లమని చెప్పుకునే భాజపా నాయకత్వం అర్థరాత్రి వేళ ఎంజీపీని దోపిడీ చేసిందని ధవళీకర్ విమర్శించారు. దీన్ని గమనిస్తున్న గోవా ప్రజలే సముచిత నిర్ణయాన్ని తీసుకుంటార’న్నారు. ఎంజీపీ ఎమ్మెల్యేల రాకతో అసెంబ్లీలో బీజేపీ బలం 14కి చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కి కూడా 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోవా విధానసభలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం వచ్చేనెల 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి.