
కరీంనగర్ : శాసన మండలి ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి చెంప పెట్టు వంటిదని కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పట్టభద్రులు తనపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వారి సమస్యలపై మండలిలో గళమెత్తుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులకు కేవలం 17 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావుల్లో 83 శాతం మంది కేసీఆర్‌ను వ్యతిరేకించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.