
విశాఖ పట్టణం : ‘మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఇక వీర బాదుడేన’ని వైకాపా అధ్యక్షుడు వై.ఎస్. జగన్ హెచ్చరించారు. బుధవారం విశాఖ పట్టణం జిల్లా పాయకరావు పేటలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో రైతులు నానా కష్టాల పాలయ్యారని విమర్శించారు. ఇసుక ఉచితంగా వితరణ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ప్రజల్ని వంచించారని దుయ్యబట్టారు. లారీ ఇసుకకు రూ.40 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లెవరూ పిల్లల్ని బడికి పంపే పరిస్థితి ఉండదనిహెచ్చరించారు. ‘అయిదేళ్లలో కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడని.. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఇక వీరబాదుడే’నన్నారు. తెదేపా గెలిస్తే ఏ సినిమా చూడాలో కూడా జన్మభూమి కమిటీనే నిర్ణయిస్తుందని ఎద్దేవా చేసారు. ‘చంద్రబాబుకు ఓటేస్తే ఉచిత విద్యుత్ ఉండదు. ఒకసారి నమ్మి మోసపోయాం. ఇంకోసారి గెలిపిస్తే ఎవరూ ఉండరు. ఆయన ఇచ్చే మూడు వేలకు మోసపో వ ద్ద’ని విన్నవించారు.