
న్యూఢిల్లీ: ‘న్యాయ్’ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీసం ఆదాయ హామీ పథకం గురించి ప్రభుత్వ ఉద్యోగిగా ట్విటర్లో విమర్శించినందుకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సంజాయిషీ తాఖీదు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రభుత్వ ఉద్యోగి స్పందించడాన్ని ఎన్నికల సంఘం తప్పు బట్టింది. ఈ చర్య ఎన్నికల నియమావళికి వ్యతిరేకమైనందున సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ‘కాంగ్రెస్ పార్టీ 1971లో గరీబీ హఠావో, 2008లో ఓఆర్ఓపీ, 2013 ఆహార భద్రత పథకాలను ప్రకటించింది. తాజాగా ఇస్తున్న కనీస ఆదాయ పథకం హామీ కూడా అదే తరహాలో ప్రజాకర్షక, అవకాశవాదంతో ఇస్తున్నదే.’ అని రాజీవ్ కుమార్ ట్వీట్ లో విమర్శించారు. కనీస ఆదాయ పథకం ఖర్చు జాతీయ స్థూలో త్పత్తిలో రెండుశాతం వరకు ఉన్నందున పదమూడు శాతం బడ్జెట్ ను ఈ పథకానికే కేటాయిస్తే ప్రజల నిజమైన అవసరాలు తీర్చలేమని వ్యాఖ్యానించారు.