పోలీసు అధికార్ల బదిలీపై న్యాయ పోరాటం

అమరావతి: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం కడప ఎస్పీ, ఇంటిలిజెన్స్‌ డీజీని బదిలీ చేయటాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సంబంధిత ఉన్నతాధికార్లను ఆదేశించారు. శ్రీకాకుళం ఎస్పీ పై కూడా బదిలీ వేటు పడింది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెదేపా కార్యకర్తలు, కొందరు ఉన్నతాధికార్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. నిఘా విభాగం అధిపతి ఏబీ. వెంకటేశ్వర రావు, మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్ మంగళ వారం రాత్రి బదిలీ చేసి, వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించ వద్దని ఆదేశించింది. వారికి వ్యతిరేకంగా వైకాపా చేసిన ఫిర్యాదుకు ఈ మేరకు స్పందించింది. ఒకే సారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం రాజకీయ కుట్రలో ఎన్నికల సంఘమూ భాగస్వామి కావడం దుర్మార్గమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ చేసారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఎన్నికల సంఘానికి రాసిన లేఖను తీసుకుని తెదేపా నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కేంద్రం, ఈసీ, తెలంగాణ ప్రభుత్వం, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘంపైనా పోరాడే విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయడానికి ఈసీ ఉందా అని ప్రశ్నించారు. అవసరమైతే ఈసీ తీరుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమిద్దామని పిలుపుని చ్చారు. చేసిన తప్పులు బయటపడతాయనే కడప ఎస్పీని బదిలీ చేయించారా? అని వైకాప అధ్యక్షుడు జగన్‌ను ప్రశ్నించారు. బాబాయి వివేకానంద రెడ్డి చనిపోతే సాక్ష్యాలన్నీ మాయం చేసి సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు అసలు నిజాలు బయటకొచ్చే అవకాశమున్నందున భయపడి ఎస్పీని బదిలీ చేయించారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగి పోతున్న రాజకీయ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎక్కడా వెనక్కి తగ్గొద్దని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. జరుగుతున్న పరిణామాలను సవాలుగా మలచుకొని, రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధిద్దామని పార్టీ నేతల్లో స్ఫూర్తి నింపారు. మళ్లీ మోదీ గెలిస్తే మైనార్టీలెవరూ బయటకు రాలేని అభద్రత వాతావరణం నెలకొంటుందని హెచ్చరించారు. గోద్రా లాంటి ఘటనల్ని పునరావృతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కనిగిరి అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై జరుగుతున్న దాడులు కక్ష సాధింపులో భాగమేనని అభిప్రాయపడ్డారు. పోలవరం ఆపాలని మళ్లీ సుప్రీం కోర్టును తెలంగాణ ఆశ్రయించటం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఆంధ్రాపై కడుపు మంటతోనే సుప్రీం కోర్టులో కేసు వేశారని ఆక్షేపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos