గతంలో ఎన్నడూ
లేని విధంగా అసలు రాజకీయాల చరిత్రలోనే లేని విధంగా రైతులు రాజకీయ నేతలు లోక్‌సభ ఎన్నికల
సమరంలో ముఖాముఖి తలపడనున్నారు.తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే ఆగ్రహంతో నిజామాబాద్
రైతులు కేసీఆర్ తనయురాలు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోటీగా ఈసారి నిమాజాబాద్
నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.నామినేషన్ల పరిశీలన అనంతరం 184 మంది
రైతుల నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఆమోద ముద్ర వేయడంతో ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులతో
పాటు 184 మంది రైతులతో కల్వకుంట్ల కవిత ఎన్నికలను ఎదుర్కోనున్నారు.మార్చ్28వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించగా అప్పటికీ రైతులు ఎవరు కూడా నామినేషన్లు
వెనక్కి తీసుకోకపోతే పరిస్థితిని ఈసీకి తెలియజేస్తారు. మొత్తం 191 నామినేషన్లకు ఆమోదం
తెలపడంతో చివరివరకు ఎవరూ వెనక్కి తగ్గకుంటే ఈవీఎంలకు బదులు ఎన్నికల్లో బ్యాలెట్ ముద్రణ
వాడడం తప్పనిసరి అవుతుంది.నామినేషన్ల ఉపసంహరణ తేదీ ముగిశాక అంతమంది ఎన్నికల బరిలో ఉంటే
ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో ఎన్నికల అధికారులు సమావేశమై నిర్ణీత గడువులోపు
బ్యాలెట్ పత్రాలు ముద్రించడం సాధ్యమవుతందా లేదా అనే అంశంపై చర్చిస్తారు.అందులో నిర్ణీత
గడువులోపు అభ్యర్థులకు గుర్తులు,బ్యాలెట్ పత్రాలు సిద్ధమైతే యథావిథిగా ఏప్రిల్11వ
తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.ఒకవేళ అది సాధ్యం కాకపోతే నిజామాబాద్ ఎన్నికలు వాయిదా
వేసే అవకాశం ఉంది.కాగా మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఇకపై ఎటువంటి సమస్యలు పునరావృతం
కాకుండా చర్యలు తీసుకుంటామని నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటూ తెరాస నేతలతో పాటు అభ్యర్థి
కవిత,తెరాస అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినా బుజ్జగించినా రైతులు వెనక్కి తగ్గడం లేదని
సమాచారం.రాజకీయ పార్టీల అభ్యర్థుల గురించి పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఈసారి రైతులే
ఎన్నికల బరిలో దిగుతుండడం అందులోనూ తన కుమార్తెకు పోటీగా నిల్చోవడంతో గుబులు చెందుతున్నట్లు
సమాచారం.తమ సమస్యల పరిష్కారం కోసం రైతుల్లో కలిగిన రాజకీయ చైతన్యానికి నిజామాబాద్
ఎన్నికలను ఉదహారణగా చెప్పుకోవచ్చు.ఎన్నికల్లో రైతులు గెలుస్తారో ఓడిపోతారో అనే విషయాన్ని
పక్కనపెడితే సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసే రాజకీయ నేతలపై నిజామాబాద్
రైతుల తిరుగుబాటు మరెంతో మంది రైతులకు ప్రేరణగా నిలిచి దేశంలోని ప్రతీచోటా ఇదే చైతన్యం
రగిలితే త్వరలోనే రైతులే దేశాన్ని పాలించే రోజులు భవిష్యత్తులో చూడవచ్చు..