న్యూఢిల్లీ : అంతర్జాల వినియోగదారుల్లో దాదాపు యాభై ఐదు శాతం మంది తమ రాజకీయ అభిప్రాయాలను బయటకు వెల్లడికి భయపడుతున్నారు. అవి అధికారులతో ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ది హిందూ గ్రూపు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది క్వింట్, పిటిఐ మద్దతుతో రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఇండియా డిజిటల్ నివేదిక ఈ నిజాన్ని పేర్కొంది. దీని ప్రకారం… ఇంగ్లీఘ మాట్లాడే భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు ప్రధానంగా ఆన్లైన్ న్యూస్, సోషల్ మీడియాపైనే ఆధారపడి ముద్రణా మాధ్యమాన్ని పక్కన పెట్టేశారని తెలిపింది. దేశంలో ఇటీవల సంభవించిన కొన్ని సంఘటనలు, పరిణామాల వల్ల అంతర్జాల వినియోగ దారుల్లో ఈ ఆందోళన పెరిగింది. 2012 నుంచి అంతర్జాలంలో రాజకీయ నేతలను బెదిరించే లేదా విమర్శించే వ్యాఖ్యలు లేదా సంబంధిత సమాచారాన్ని పోస్ట్ చేసినందుకు 17మందిని అరెస్టు చేశారు. సర్వే చేసిన వారిలో దాదాపు 68 మంది తమ స్మార్ట్ ఫోన్లలో వార్తలు చదువుతుండగా, 52శాతం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సప్ (52శాతం), ఇన్స్టాగ్రామ్(26), ట్విట్టర్ (18), ఫేస్బుక్ మెసెంజెర్ (16) ఇతర వార్తా వనరులుగా వున్నాయి. ప్రింట్ మీడియాను కేవలం 16శాతం మంది మాత్రమే ఉపయోగిస్తుండగా, ఆన్లైన్ న్యూస్‌ను 56శాతం మంది, సోషల్ మీడియాను 28 శాతం మంది ఉపయోగిస్తున్నారు. వీరంతా ప్రధానంగా 35ఏళ్ళలోపు వారు.