
న్యూఢిల్లీ: పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు బ్యాంకులు కలిసి కట్టుగా ముందుకు వచ్చి నట్లే తన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలోనూ వ్యవహరించి ఉన్నట్లయితే మూత పడేది కాదని ఆర్థిక నేరగాడు విజయమల్య మంగళవారం ఒక ట్వీట్లో బ్యాంకు విధానాల్ని తప్పుబట్టారు.‘ఏడేళ్ల కిందట భారత దేశంలోని ఒక మంచి విమాన సంస్థ మూత పడడానికి బ్యాంకులే కారణమని ఆరోపించారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్ ఎయిర్వేస్ను ఆదుకుని ఉద్యోగాలు, సంస్థల్ని కాపాడేందుకు ముందుకు రావడం సంతోషకరం. కింగ్ ఫిషర్ విషయంలో కూడా నేను అప్పుడు కోరుకున్నది ఇదే’ అని ట్వీట్లో విపులీకరించారు. ఇప్పటికైనా భారత బ్యాంకులు తాను చెల్లిస్తానన్న డబ్బు తీసుకుని జెట్ ఎయిర్వేస్ను కాపాడాలని ఆయన కోరారు. ‘‘నేను మరోసారి చెబుతున్నాను… ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇతర రుణదాతల అప్పు తీర్చేందుకు నేను కర్నాటక హైకోర్టుకు నగదు,ఆస్తులు సమర్పించాను. బ్యాంకులు నా డబ్బుల్ని ఎందుకు తీసుకోవడం లేదు. జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది క’దా న్నారు. తాను కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను, ఉద్యోగులను కాపాడేందుకు రూ.4 వేల కోట్లు ఖర్చుచేశాననీ, దాన్ని గుర్తించగ పోగా, సమస్య నుంచి బయట పడేందుకు ఉన్న అన్ని దారులూ మూసి వేశారని ఆక్రోశించారు. ‘ఇదే ప్రభుత్వ బ్యాంకులు దేశంలోనే అత్యుత్తమ సిబ్బంది కలిగిన సంస్థ, కనెక్టివిటీ నిలిచిపోయేలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయి. ఎన్డీయే హయాంలో రెండు నాల్కల ధోరణికి ఇదే నిదర్శనం’ అని విమర్శించారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం రూ.9 వేల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ మల్య విచారణ నుంచి తప్పించుకునేందుకు లండన్ వెళ్లి పోవడంతో పరారీ ఆర్ధిక నేరగాడిగా ప్రకటించారు.