ఎన్నికలకు జోషి రాం రాం

దిల్లీ: భాజపా అధిష్టానం సూచన ప్రకారమే తాను వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని పార్టీ సంస్థాపకుల్లో ఒకరు, పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ మురళి మనోహర్‌ జోషి మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు తను లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని వహించిన కాన్పూర్‌ నియోజక వర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. ‘ప్రియమైన కాన్పూర్‌ ఓటర్లకు.. రానున్న ఎన్నికల్లో కాన్పూర్‌ నుంచే కాకుండా ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయోద్దని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఈ రోజు నన్ను కోరారు’’ అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఆయన సంతకం లేకున్నా ఈ విషయాన్ని మురళీ మనోహర్ జోషి స్వయంగా ధ్రువీకరించినట్లు ఓ ఆంగ్ల మాధ్యమ సంస్థ స్పష్టీకరించింది. ఇప్పటికే గాంధీ నగర్ బరి నుంచి తనను తప్పించినందుకు సీనియర్‌ నేత అడ్వానీ అసంతృప్తి వ్య క్తీకరించటం తెలిసిందే. తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్‌ జోషి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. తన పోటీ విషయంలో పార్టీ నిర్ణయాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడినట్లు సమాచారం. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి స్థానం నుంచి తప్పుకుని కాన్పూర్‌ నుంచి పోటీ చేసి అధిక మెజార్టీతో గెలుపొందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos