
సుక్మ:ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని బీమాపురంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బస్తర్ డివిజన్ అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టు వ్యతిరేక కార్య కలాపాల్ని చేపట్టాయి. ఇందులో భాగంగా కర్కాన్ గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా సిబ్బంది ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేస్తుండగా కొందరు మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలూ ఎదురు కాల్పులకు దిగారు. ఫలితంగా నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. ఘటనా స్థలంలో ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.