దేశంలో దుర్యోధన, దుశ్శాసన పాలన

విజయవాడ: భారతంలో దుర్యోధన, దుశ్శాసనుల్లా ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షాలు దేశాన్ని పరిపాలిస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. సోమవారం మధ్యాహ్నం నగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. . బిజెపి కూటమి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ పాలన ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని ఆశించారు. గత 20 ఏళ్ల ఎన్నికల్లో తానెప్పుడూ ఇలాంటి స్పందన చూడలేదన్నారు. సభలో పాల్గొన్న జన ప్రవాహమే అభివృద్ధి, పాలకుల దుర్మార్గపు చర్యలపట్ల కలిగిన వ్యతిరేకత, చైతన్యానికి నిదర్శనమని తెలిపారు. దేశానికి చౌకీదారులా పని చేస్తానని చెప్పిన మోదీ, అంబానీ, అదాని, మాల్యాల అక్రమాస్తులకు చౌకీదారులా పని చేస్తున్నారని విమర్శించారు. మోడీ పాలనతో దేశంలో ప్రజలకు రక్షణ కరువైంద న్నారు. దేశసంపదలో 73 శాతాన్ని అంబాని, అదానీలకు దోచిపెట్టి ప్రజలను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహించారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన దొంగలు మాల్యా, నీరవ్ మోడీలకు ప్రధాన మంత్రి కాపలాదారులా పనిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలోని ముస్లిములు, క్రైస్తవులు, దళితులపై మతోన్మాద దాడులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో సగటు మధ్య తరగతి ప్రజల జీవన స్థితి గతులు అస్తవ్యస్తంగా మారాయని వ్యాఖ్యానించారు. పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరకులు ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. రేట్లు పెరిగిన గ్యాసు బండలు, ప్రజల మెడకు గుదిబండలా మారాయని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు ఏ ఒక్కటీ మోదీ అమలు చేయలేదని, అధికార దాహంతో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి దేశప్రజల్ని మోసం చేశారని నిప్పులు చెరిగారు.పరిపాలనతో రైతాంగం కుదేలయ్యిందని, యువత నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో జరిగిన ఉగ్ర వాదులదాడిని మోదీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి ప్రచార సాధనంగా మలచుకుంటున్నారని తప్పుబట్టారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల ఫోటోలు పెట్టుకుని మోడీ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. భారత వాయుసేన చేసిన మెరుపు దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారో చెప్పలేని దుస్థితిలో భాజపా నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. బాబు, మోడీల జోడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఇప్పుడు బాబు తరహాలోనే వైకాపా అధినేత జగన్ కూడా మోడీ సరసన చేరారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యామ్నాయ రాజకీయానికి విజయాన్ని అందించాలని, రాష్ట్రాభివృద్ధి కేవలం ప్రత్యామ్నాయ పాలనతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిని ప్రజలే తమ ఓటుతో నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో దుర్యోధన, దుశ్శాసన పాలన

తాజా సమాచారం

Latest Posts

Featured Videos