మండ్యలో సంకుల సమరం

మండ్యలో సంకుల సమరం

బెంగళూరు, న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌
: కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టీ మండ్య లోక్‌సభ నియోజకవర్గాన్ని
ఆకర్షిస్తోంది. తెలుగింటి ఆడపడుచు సుమలత అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండడమే దీనికి
ప్రధాన కారణం. ఆమె భర్త, ప్రముఖ కన్నడ హీరో అంబరీశ్‌ ఇటీవల కన్నుమూశారు. ఈ ఎన్నికల్లో
ఆమె ప్రత్యర్థి ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి తనయుడు నిఖిల్‌.
ఆయన తాత, జేడీఎస్‌వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మండ్యను తన పార్టీకి పెట్టని
కోటగా మలిచారు. కనుక అక్కడి నుంచే రాజకీయ అరంగేట్రంతో పాటు తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశించాలని
నిఖిల్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. వాస్తవానికి ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌, జేడీఎస్‌ల
రాజకీయ యుద్ధ వేదిక. ఒక్కలిగుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో దేవెగౌడకు అశేష
సంఖ్యలో అనుచర గణం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి
ఎస్‌ఎం. కృష్ణ ద్వారా కాంగ్రెస్‌ తనదైన రాజకీయ పావులను కదుపుతూ వచ్చేది. ఆయన కూడా ఒక్కలిగ
సామాజిక వర్గానికి చెందిన వారు. అయినా దేవెగౌడను ఆయన ధాటిగా ఎదుర్కోలేకపోయారు.

                సుమలత భర్త సొంత జిల్లా మండ్య. ఆయన
అక్కడి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో పని చేశారు.
మండ్య లోక్‌సభ స్థానాన్ని తనకివ్వాలని ఆమె కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాన్ని కోరింది.
అయితే కాంగ్రెస్‌ ఇప్పుడు రాష్ట్రంలో జేడీఎస్‌తో కలసి సంకీర్ణ సర్కారును నడుపుతోంది.
లోక్‌సభ ఎన్నికలకు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కూడా కుదిరింది. కాంగ్రెస్‌ 20, జేడీఎస్‌
ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జేడీఎస్‌ సిట్టింగ్‌ స్థానమైన
మండ్యను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉన్నందున, అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించలేమని
కాంగ్రెస్‌ నిస్సహాయత వ్యక్తం చేసింది. అయినా పట్టు వీడని సుమలత స్వతంత్ర అభ్యర్థిగా
రంగంలోకి దిగారు. కన్నడ హీరోలు దర్శన్‌, యశ్‌తో పాటు కన్నడ చిత్ర రంగంలోని అత్యధికులు
సుమలతకు మద్దతు పలుకుతున్నారు.

గెలుపు అవకాశాలు…?

        మండ్యలో తొలి నుంచీ కాంగ్రెస్‌, జేడీఎస్‌ల
మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీది ఇక్కడ ఎప్పుడూ మూడో స్థానమే. డిపాజిట్‌ దక్కితేనే
గొప్ప విజయం. ఇక క్షేత్ర స్థాయిలో కూడా కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య రాజకీయ శత్రుత్వం
ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తల్లో ఎక్కువ మంది
జేడీఎస్‌తో పార్టీ మైత్రి పట్ల అయిష్టంగానే ఉన్నారు. వీరందరూ గంప గుత్తగా సుమలత వైపు
మొగ్గితే, నిఖిల్‌కు కష్ట కాలమే అనుకోవాలి. దీనికి తోడు బీజేపీ సుమలతకు మద్దతు ప్రకటించింది.
అయితే కాంగ్రెస్‌ ముఖాముఖి ఢీ కొన్నప్పుడే విజయం సాధించిన జేడీఎస్‌, సుమలత తమకు సమ
ఉజ్జీ అని ఏమాత్రం భావించడం లేదు. మరో వైపు జేడీఎస్‌ అంటే ఇష్టపడని నాయకులను, కార్యకర్తలను
బుజ్జగించడానికి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం కసరత్తును ప్రారంభించింది. నామినేషన్ల
ఉపసంహరణ ఘట్టం ముగిశాక ఈ ప్రయత్నాలు ముమ్మరం కానున్నాయి. సంకీర్ణ ధర్మాన్ని పాటించి
జేడీఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలని, బీజేపీని అడ్డుకునే ప్రయత్నంలో అధిష్టానం తీసుకున్న
నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కార్యకర్తలను అనునయించడానికి కాంగ్రెస్‌ సీనియర్లు
రంగంలోకి దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos