పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం హైదరాబాద్లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని పవన్ ఆరోపించడం సబబా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దెబ్బలు తిని ఆంధ్రాకు పారిపోయిన వారిని ఒక్కరినైనా చూపించాలని సవాలు విసిరారు. తానూ హైదరాబాద్లోనే ఉంటున్నానని, పవన్ రుజువులు చూపిస్తే తానూ పారిపోయి ఆంధ్రాకు వస్తానని ఎద్దేవా చేశారు. తాను 1984 నుంచి తెలంగాణలో ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ను విమర్శిస్తూ వ్యాసాలు రాశానని గుర్తు చేశారు. అయినా ఏ తెలంగాణ బిడ్డా తనను కొట్టలేదన్నారు. కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఇదే పవన్ గతంలో కేసీఆర్ను ఆంధ్రా నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారని, ఇప్పుడు ఓట్ల కోసం మాట మారుస్తున్నారని విమర్శించారు.