
అమరావతి:తెలంగాణ రాష్ట్ర సమితి, వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన బహిర్గతమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు ‘జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైన కొందరు నేతలు ఆ తర్వాత వై కాపాలోకి వెళ్లారు. ఎందుకని ఆరా తీస్తే హైదరాబాద్లో వారికి ఆస్తులున్నాయి. దరిమిలా సమస్యలు ఎదురు కాకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారన్నా’రు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్ర బాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఆయనకు కానుకగా మారుతుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు భావో ద్వేగాలతో గడిచి పోయినందును వాటికి తెరదించాలని కోరారు. ‘ఆంధ్ర ప్రదేశ్లో జగన్తో కలిసి పోటీ చేయాలని కొందరు తెలంగాణ స్నేహితులు సూచించారు. తెదేపాను నిర్మూలించిన తర్వాత ఆ తర్వాత మీరిద్దరూ తేల్చుకోండన్నారు. అంతా మాత్రాన జగన్పై నాకు ఉన్న అభిప్రాయాలు మార్చుకోజాలన’ని చెప్పానన్నారు.‘ఓటు హక్కు వినియోగించుకోవటానికి ముందు ప్రజలు అన్ని విషయాలు ఆలో చించాలి. ఎవరి హయాంలో మేలు జరిగిందో.ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకోవాల’ కోరారు. తన బాబాయ్ వివేకా హత్యను జగన్ ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. ఇంట్లో మనిషిని హత్య చేస్తే అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. కోడి కత్తి పోటుపై హడావుడి చేసిన ఆయన వివేకా నంద రెడ్డి హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. హత్యా రాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందోనని భయమేస్తోందని పేర్కొన్నారు.