సుమలత తరపున ప్రచారం చేశారో..మీ ఆస్తులపై దాడులు చేయిస్తాం..

కర్ణాటక రాష్ట్రంలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరుగనున్న ఎన్నికలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పలు వివాదాలు,ఉత్కంఠకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి.దివంగత మాజీ మంత్రి రెబల్‌స్టార్‌ అంబరీశ్‌ సతీమణి తెలుగు ప్రజలకు కూడా సుపరిచితురాలైన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనుండగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి ప్రత్యర్థిగా బరిలో దిగుతుండడంతో మండ్య ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.సుమలత పోటీ నిఖిల్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికార జేడీఎస్‌ నేతలు మొదటిరోజు నుంచి సుమలతపై రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.కొద్ది రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న,మంత్రి హెచ్‌డీ రేవణ్ణ మహిళ దినోత్సవం రోజునే సుమలతపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.అంతటితో ఆగకుండా సుమలతపై చవకబారు వ్యాఖ్యలు చేయడమే కాకుండా సుమలతకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని సుమలతకు క్షమాపణలు చెప్పడానికి తనకేమి పిచ్చి పట్టలేదంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.రేవణ్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కూడా సుమలతపై ఇదేతరహా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుమలతకు మద్దతుగా నిలిచిన శాండల్‌ఉడ్‌ హీరోలపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.కర్ణాటకలో భారీమాస్‌ ఫ్యాన్‌బేస్‌ ఉన్న హీరలైన దర్శన్‌,యశ్‌లు సుమలతకు మద్దతుగా నిలవడంతో జేడీఎస్‌ నేతలకు గుబులు రెట్టింపయింది.దీంతో సుమలత తరపున ప్రచారం చేస్తే మీ ఆస్తులపై దాడులు చేయిస్తామని మీ జాతకాలు వెలికి తీస్తామని అధికారంలో మా ప్రభుత్వమే ఉందని మీ అంతు తేలుస్తామంటూ జేడీఎస్‌ ఎమ్మెల్యే నారాయణగౌడ హెచ్చరించారు.కన్నడ నటులు తమ పనులు చూసుకొని ఇళ్లల్లో ఉండాలని ప్రచారాలు,ప్రసంగాలు అంటూ సుమలతకు మద్దతుగా నిలబడి జేడీఎస్‌పై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.జేడీఎస్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా,సినిమాల పరంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి.అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో నోరు జారిన సదరు ఎమ్మెల్యే తాను వ్యక్తిగత కక్ష్యతో వ్యాఖ్యలు చేయలేదని సుమలత తరపున ప్రచారం చేస్తున్న యశ్‌,దర్శన్‌లు మండ్య జిల్లా ప్రజలను,జేడీఎస్‌ పార్టీని విమర్శించారనే కోపంతో ఆ వ్యాఖ్యలు చేశానంటూ వివరణ ఇచ్చుకున్న ప్రయత్నం చేశారు.అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇక ఫలితం కోసం ఎదురు చూడడం తప్ప.అయితే ఈ హెచ్చరికలపై ‘నమ్మ కర్ణాటక రక్షణ వేదిక’ అధ్యక్షుడు జయరాజ్ నాయుడు బృందం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దర్శన్ – యష్ లు ప్రచారం చేస్తారని.. వారి సినిమాలకు ఎన్నికల కోడ్ వర్తింప చేయకుండా విడుదల చేసేలా అనుమతివ్వాలని కోరారు. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos