వచ్చే నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు.లోక్సభ ఎన్నికల్లో కూడా వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని 22 నుంచి 23 ఎంపీ సీట్లు వైసీపీ వశమవుతాయంటూ తలసాని తెలిపారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనతో విసుగెత్తిపోయారని పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టనున్నారన్నారు.సరిగ్గా ఎన్నికలకు 20 రోజులు ఉందనగా తలసాని చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు మంచి అస్త్రంలా లభించాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తెరాస అధినేత కేసీఆర్లు ఏకమై ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఇక్కడ జగన్ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబుకు తలసాని చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. తలసాని చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైసీపీ-తెరాసలు చేతులు కలిపాయన్నదానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరమా అంటూ తన వాదన వినిపించే అవకాశం ఉంది.తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలసి తెలంగాణలో తెదేపా పోటీ చేసినపుడు కాంగ్రెస్కు ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేసినట్లేనని కాంగ్రెస్ తెదేపా కూటమి గెలిస్తే అమరావతి నుంచి పాలన నడుస్తుందంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాల్లో సరిగ్గా ఇదే అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే కేసీఆర్కు ఓటేసినట్లేనని ఆరోపిస్తున్న తరుణంలో తాజాగా తలసాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మరింత బలాన్నిచ్చాయి..