ఢిల్లీ : ఇంకో మూడు రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం కానుంది. ఇది పూర్తి కాగానే మరో పది రోజులకే వన్డే ప్రపంచ కప్పునకు అంకురార్పణ జరుగనుంది. దీనికి ముందు ఆరు వారాల పాటు జరిగే ఐపీఎల్‌లో ఆటగాళ్లు అలసిపోయి ఫిట్‌నెస్ కోల్పోతారేమోననే ఆందోళన అన్ని జట్లలోనూ ఉంది. ఇప్పటికే పలు జట్ల కోచ్‌లు, కెప్టెన్లు ఐపీఎల్ నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రప్పించాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. ఐపీఎల్ లేదా అంతర్జాతీయ మ్యాచులలో ఆడే అవకాశం వస్తే వదలకూడదన్నాడు. అలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావని, వీలైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ దీనిపై స్పందిస్తూ ప్రపంచ కప్పులో ఉత్తమ జట్టును దింపడానికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ప్రయత్నిస్తాయని, కనుక వాటి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు. భారత జట్టు కూడా ఏదో ఒక సమయంలో తన ప్రధాన బౌలర్లపై ఆంక్షలు విధించవచ్చని అంచనా వేశాడు.