ఏటా వేసవిలో క్రికెట్ అభిమానులకు సంబరాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏటా ఆటగాళ్ల, యాజమాన్యాల సంపదను రెట్టింపు చేయడంతో పాటు దేశ స్థూలోత్పత్తికి తన వంతు వాటాను అందిస్తోంది. 2008లో అప్పటి బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోదీ మేధస్సు నుంచి జాలువారిన ఈ ఐపీఎల్ ప్రస్థానం 72.36 కోట్ల డాలర్లతో ప్రారంభమైంది. 2018 నాటికి ఈ లీగ్ బ్రాండ్ విలువ రూ.43 వేల కోట్లకు (6.3 బిలియన్ డాలర్లు) చేరుకుందంటే, దాని విశ్వ రూపాన్ని అర్థం చేసుకోవచ్చు. దేశ స్థూలోత్పత్తికి రూ.1,150 కోట్లు సమకూర్చింది. ఇతర లావాదేవీలను కలుపుకొంటే ఈ మొత్తం రూ.2,650 కోట్లు
పారితోషికాలు
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 11 సీజన్లు ముగిశాయి. 694 మంది ఆటగాళ్లు పారితోషికాలు అందుకున్నారు. ఫ్రాంచైజీలు…ఆటగాళ్లకు రూ.4,284 కోట్ల దాకా చెల్లించాయి. ఇందులో 426 మంది భారత ఆటగాళ్లు రూ.2,354 కోట్లు అందుకున్నారు. 268 మంది విదేశ ఆటగాళ్లు రూ.1,930 కోట్లు చేజిక్కించుకున్నారు. వీరిలో 84 ఆసీస్ క్రికెటర్లకు రూ.653 కోట్లు దక్కాయి. దక్షిణాప్రికాకు చెందిన 52 మందికి రూ.428 కోట్లు, విండీస్ క్రికెటర్లు 26 మందికి రూ.279 కోట్లు, శ్రీలంక ఆటగాళ్లు 26 మందికి రూ.191 కోట్లు న్యూజిలాండ్‌కు చెందిన 22 మంది క్రికెటర్లకు రూ.151 కోట్లు దక్కాయి.
ప్రసార హక్కులు
ఐపీఎల్ ప్రసార హక్కుల్లోనూ తనదైన శైలిలో సంపాదనను రాబట్టింది. స్టార్ ఇండియా ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్లకు అంతర్జాతీయ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. సోనీ నెట్‌వర్క్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, జియో, ఫేస్‌బుక్‌లు పోటీ పడినప్పటికీ స్టార్ ఇండియా ముందు నిలబడలేకపోయాయి. స్టార్ ఒక ఐపీఎల్ మ్యాచ్ ప్రసారానికి రూ.54 కోట్లు చెల్లిస్తోంది. భారత్ తలపడే మ్యాచ్‌లకు చెల్లిస్తున్నది రూ.43 కోట్లు మాత్రమే. అంటే…ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ ఇట్టే తెలిసిపోతోంది.