దారి తప్పుతున్న సిట్ దర్యాప్తు : వివేక తనయ సునిత

పులివెందుల: వై.ఎస్. వివేకా నంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందానికి ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశాన్ని ఇవ్వలేదని, విచారణను సవ్యంగా సాగకుండా విషయాన్ని పక్కదారి పట్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. బుధవారం ఇక్కడ ఆమె మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. కేసును సిబిఐ, లేక సిట్‌ లేక ఇతర ఏ సంస్థ విచారణ జరిపినా తనకు అభ్యంతరం లేదంటే దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా సాగాలన్నదే తన డిమాండన్నారు. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా సాగేందుకు మాధ్యమాలు, రాజకీయులు సహకరించాలని విన్నవించారు. సిట్ దర్యాప్తును ప్రభావితం చేసేలా మాధ్యమాలు వివిధ రకాల కథనాల్ని ప్రచారం ప్రసారం చేస్తున్నారని తప్పుబట్టారు. గత ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు, వార్తలు వల్ల తీరని ఆవేదన కలిగిందన్నారు. సిట్‌ నివేదిక బహిర్గతమయ్యేంత వరకూ మాధ్యమాలు, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోరారు.
‘మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ పొరపొచ్చాలు ఉంటాయి. వీటిని అర్థం చేసుకునే పరిణతి మాకుంది. మా కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నారు. అభిప్రాయభేదాలు ఉండడం సహజమే. దీనర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు. అది మా సంస్కృతి కాదు. మా కుటుంబంలోని అనుబంధాన్ని అర్ధం చేసుకోవాలంటే దానికి ఎంతో మానసిక పరిణతి ఉండాలి. ఏటా మా కుటుంబం ఒకచోట కలుసుకుంటాం. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కలుసుకున్నాం. మా లాంటి కుటుంబం ఎక్కడా ఉండదు’అని తమ కుటుంబ వైవిధ్యం, విశిష్టతలను విపులీకరించారు.
‘‘మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయనకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబం. పులివెందుల ప్రజలు, ఇక్కడి తోటలంటే ఎంతో ఇష్టం. కొంత కాలంగా మా అమ్మకు అనారోగ్యం. అందువల్ల నా దగ్గరే ఉంటోంది. చాలా కాలంగా నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. నాన్న స్నేహితులు, అనుచరులు ఆయనను బాగా చూసుకునేవారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు పక్కనే ఉండేవారు. ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత మార్చారు. చాలా బాధ కలిగింది. పేపర్లు, టీవీల్లో వచ్చిన వార్తల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువ విచారం కలుగుతోంది. మా నాన్న ఎంతో హుందాగా బతికారు. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడ కూడదని అంటుంటాం. గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానిస్తున్నారు. ఇలా వ్యవహరించడం సరికాదు. మాధ్యమాల్లో వస్తున్న వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అనిపించడం లేదా? ఈ కిరాతకమైన పని చేసిన వారిని గుర్తించాలి కదా! వారికి శిక్ష పడాలి. సిట్ నుంచి ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది. చాలా నెగటివ్‌ వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు. జగన్‌ సీఎం కావాలని మా నాన్న బాగా కష్ట పడ్డారు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు.
‘జగనన్న ముఖ్యమంత్రి కావాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. మా కుటుంబంలో ఎవరి మధ్య విభేదాలు లేవు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్ద’ని మాధ్యమాల్ని కోరారు. ‘పెద్ద వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే దానికి పెద్ద ప్రభావం ఉంటుంది.అలాంటి వ్యాఖ్యలు చేయొ ద్దు .పక్క దర్యాప్తు జరుగుతుండగా నాది కానీ, ఎవరిదైనా కానీ అభిప్రాయాలు ఎందుక’ని ప్రశ్నించారు.ఆ రోజు పోలీసులకు ఇచ్చిన లెటర్‌లో ఉన్నది మా నాన్న చేతి రాతో కాదో ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. . ‘.పెద్ద కుటుంబంపై మీద ఇన్ని ఆరోపణలు, కళంకాలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టం. పారదర్శకంగా విచారణ జరిపించడంతో పాటు దోషులు ఎంతటి వారైనా శిక్ష పడాలన్నదే తమ ఉద్దేశం . దర్యాప్తు జరిగిన తర్వాత అది తప్పో, ఒప్పో, ఆ తర్వాత మా నిర్ణయాన్ని చెబుతామ’ని ఒక ప్రశ్నకు ప్రతిస్పందించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos