తిరువనంతపురం : నిరుద్యోగం, పేదరికం, ఈతి బాధలు లాంటి ఎన్నో సమస్యలతో దేశం సతమతమవుతుంటే కేంద్రంలోని అధికార ఎన్డీఏ, జాతీయ భద్రత ఆసరాగా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పుల్వమా ఉగ్రదాడి అనంతరం పరిస్థితులను బీజేపీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను దేశ భద్రతను తక్కువ చేసి మాట్లాడడం లేదంటూ, కేవలం ఒకే ఒక విషాద సంఘటనను ప్రధానాంశంగా చూపుతూ బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో నిత్యం ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంటుందని, ఇది కోట్లాది మందిపై జరుగుతున్న ఉగ్రదాడి వంటిదేనని అన్నారు. దీనికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపాలన్నారు. నిజమైన సమస్యలను ప్రజలకు తేటతెల్లం చేయడమే తమ పార్టీ కర్తవ్యమన్నారు. మోదీ పాలనలో మన ప్రజాస్వామ్య మూలాలపైనే దాడి జరుగుతోందన్నారు. ఇంకో పర్యాయం అధికారంలోకి వచ్చే అర్హత బీజేపీకి లేదన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, దేశంలో రైతులు, నిరుద్యోగ సమస్యలు పెరిగిపోయాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు.