పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియల్ని సోమ వారం సాయంత్రం ఐదు గంటలకు సైనిక లాంఛనాలతో మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. మనోహర్ పారికర్ పార్థివ దేహాన్ని సోమవారం ఉదయం పనాజీలోని భాజపా కార్యాలయానికి తరలించారు. పార్టీ నేతలు నివాళు లర్పించిన అనంతరం ప్రజల సందర్శనార్థం పారికర్ భౌతిక కాయాన్ని కాలా అకాడమీకి తరలించ నున్నారు. సాయంత్రం 4 గంటలకు పారికర్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు తెలిసింది. క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడిన మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు సార్లు గోవా ముఖ్య మంత్రిగా, మూడేళ్ల పాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు చేసారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు